87వరోజు యువగళం పాదయాత్రకు జననీరాజనం -ఎమ్మిగనూరు, కోడుమూరు పరిధిలో కొనసాగిన యాత్ర -పాదయాత్ర పొడవునా వినతుల వెల్లువ… నేనున్నానని భరోసా! కోడుమూరు నియోజకవర్గంలో యువనేతకు అపూర్వ స్వాగతం
ఎమ్మిగనూరు/కోడునూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 87వరోజు ఎమ్మిగనూరు, కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగింది. మధ్యాహ్నం భోజన విరామం వరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సాగిన పాదయాత్ర తర్వాత కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి చేరింది. కోడుమూ నియోజకవర్గంలో ప్రవేశించిన యువనేతకు అపూర్వస్వాగతం లభించింది. భారీఎత్తున జనం రోడ్లపైకి వచ్చి యువనేతను స్వాగతించారు. అడుగడుగునా యువనేతపై పూలవరం కురిపించి బాణాసంచా కాలుస్తూ హోరెత్తించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గాజులదిన్నెలోని క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు దారిపొడవునా జనం నీరాజనాలు పలికారు. అడుగడుగునా గ్రామీణ ప్రాంతాల ప్రజలు యువనేతకు ఎదురేగి తమ సమస్యలు చెప్పుకున్నారు. గాజులదిన్నె శివార్లలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న మునగపంటను పరిశీలించి, రైతు నాగిరెడ్డిని యువనేత పరామర్శించారు. తర్వాత యువనేతను మత్స్యకారులను కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు ముంపు బాధితులు, కైరవాడ గ్రామ ఉల్లి రైతులు, గోనెగుండ్ల రైతులు, వేమువాడ, పుట్టపాశం గ్రామస్తులు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. కైరవాడలో శ్రీనివాసులు అనే రైతు యువనేత లోకేష్ ను కలిసి భూరక్ష పథకం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తెలియజేశారు. సాయంత్రం కోడుమూరులో నిర్వహించిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దఎత్తున జనం హాజరయ్యారు. 87వరోజు యువనేత లోకేష్ 15.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించారు. మొత్తంగా ఇప్పటివరకు 1118.4 కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర పూర్తయింది.
యువనేత ఎదుట వ్యక్తమైన అభిప్రాయాలు:
ఇల్లు కట్టుకోమని వత్తిడి తెస్తున్నారు -సుమిత్ర, కైరవాడి.
15ఏళ్ల క్రితం నా భర్త ప్రమాదంలో చనిపోయాడు. ముగ్గురు ఆడపిల్లలతో ఉన్న నన్ను అత్తింటివారు తరిమేశారు. ఒక అమ్మాయిని చదివిస్తూ మిగిలిన ఇద్దరినీ నాతోపాటు కూలీపనులకు తీసుకెళ్తున్నాను. రూ.1500 చెల్లించి అద్దె ఇంట్లో ఉంటున్నా. పుట్టపాశం స్థలం ఇచ్చిన ప్రభుత్వం, ఇల్లు కట్టుకోవాలని వత్తిడితెస్తున్నారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరితే, నువ్వే కట్టుకోమని చెబుతున్నారు కూలీపనులు చేసుకుని జీవితాన్ని నెట్టుకొస్తున్న నాకు ఇప్పుడున్న రేట్లతో ఇల్లు నిర్మించుకునే స్థోమత లేదు. ప్రభుత్వం ఇచ్చే నాలుగు విడతలుగా ఇచ్చే 1.8లక్షల సొమ్ము సరిగా బేస్ మెంట్ కే సరిపోదు.
పెన్షన్ తీసేశారు… బతకడం కష్టంగా ఉంది! -సోమలింగమ్మ, పుట్టపాశం.
అయిదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. జనవరి నుంచి నా పెన్షన్ నిలిపివేశారు. ఆరుగురు బిడ్డలు ఉన్న నాకు రెండెకరాల మెట్ట పొలం ఉంటే, పొలం ఎక్కువగా ఉందని పెన్షన్ తీసేశారు. కూలీపని చేసి చాలచాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. బతుకుబండి లాగడం కష్టంగా ఉంది. ఈ ప్రభుత్వానికి మాలాంటి వారి ఉసురు తగిలే తీరుతుంది.
ఒక్క ట్రైసైకిల్ కూడా ఇవ్వలేదు!-బోయ సోమన్న, మంగలి రంగన్న, పి.హనుమంతు, వికలాంగులు, కైరవాడి.
మా గ్రామంలో వందమంది వికలాంగులు ఉంటే, ఒక్క ట్రైసైకిల్ కూడా ఇవ్వలేదు. వికలాంగులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణ లేదు. నిరుద్యోగ వికలాంగులకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలిచ్చి సాయం అందిస్తే చిరువ్యాపారాలు చేసుకొని జీవనం సాగిస్తాం.
నేను నీలాగా పిల్లిని కాదు…వేటాడేపులిని! పేదల గొంతుక విన్పించేందుకే యువగళం రూ.లక్ష కోట్ల సీక్రెట్ ఏమిటో ప్రజలకు చెప్పు అనగనగా ఒక జగన్నాథం… నిజంగా అనాధేనా? రజనీకాంత్ చూసి ప్యాంటు తడుపుకుంటున్నారు! తండ్రికి మంచిపేరు వచ్చినా సహించలేని కోడుమూరులో ఎమ్మెల్యే , కోడుమూరు బహిరంగసభలో యువనేత లోకేష్
కోడుమూరు: నేను ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. నిన్ను వేటాడే పులినని టిడిపి యువనేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోడుమూరులో జరిగిన బహిరంగసభలో లోకేష్ మాట్లాడుతూ…. జగన్ కి నేనంటే భయం. అందుకే నన్ను అడ్డుకోవడానికి రోజుకో గ్యాంగ్ ని పంపుతున్నాడు. యువగళం…మనగళం…ప్రజా బలం. వైసీపీ పేదల పాలిట శని. పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతుంది అంటున్న వైసీపీ ఆయన దేశంలోనే ఎక్కువుగా డబ్బున్న సీఎం ఎలా అయ్యాడో చెప్పే దమ్ముందా? లక్ష కోట్లు సంపాదించడానికి సీక్రెట్ ఏంటో వైసీపీ పేదలకు చెప్పగలడా? ఆయన దేశంలోనే ధనిక సీఎం కానీ ఏపీ ప్రజలు మాత్రం ఎప్పటికీ పేదరికంలోనే ఉండాలని జగన్ కోరుకుంటాడు. అందుకే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడ్డుక్కునే పరిస్థితికి తీసుకొచ్చాడు. పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నది మీ లోకేష్ కోరిక, అందుకే యువగళం పాదయాత్ర మొదలు పెట్టాను. పేదల గొంతు వినిపించడానికే యువగళం ప్రారంభించా.
కేక పుట్టించిన కోడుమూరు!
కోడుమూరు కేక పుట్టించింది. ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే వైసీపీ కి గుండెదడ మొదలవ్వడం ఖాయం. ఉమ్మడి రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన నియోజకవర్గం కోడుమూరు. దళిత వర్గానికి చెందిన దామోదరం సంజీవయ్య గారు కోడుమూరు నుండి గెలిచి ముఖ్యమంత్రి గా పనిచేసారు. ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయ భాస్కర రెడ్డి గారు కోడుమూరు నియోజకవర్గానికి చెందిన వారే. సుంకుల పరమేశ్వరి ఆలయం, గోరంట్ల లక్ష్మి మాధవస్వామి దేవాలయం ఉన్న పుణ్య భూమి కోడుమూరు. సుంకేసుల బ్యారేజ్ కి పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన చేస్తే చంద్రబాబు గారు పూర్తి చేశారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న కోడుమూరు నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
రజనీకాంత్ ను చూసి ప్యాంటు తడుపుకుంటున్నారు!
స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ గారు పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారితో ఉన్న అనుబంధం, చంద్రబాబు గారి విజన్ గురించి మాట్లాడారు. రాజకీయాల గురించి మాట్లాడలేదు. వైసిపి గురించి అసలే మాట్లాడలేదు. చంద్రబాబు గారి గొప్పతనం గురించి రజినీకాంత్ గారు చెప్పడం చూసి వైసీపీ టీవీ పగలకొట్టాడు అంట. రజినీకాంత్ గారు ఎప్పుడో చెప్పారు నాన్నా పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది అని. ఆయన సింగిల్ గా వచ్చి వెళ్ళిపోయాడు. వైసిపి వాళ్ళు గుంపులుగా వచ్చి హడావిడి చేస్తున్నారు. ఆయన ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. అందుకే వైసిపి వాళ్ళు ప్యాంట్లు తడిపేసుకుంటున్నారు.
దమ్ముంటే ఆ స్టిక్కర్లు బిల్లలమీద అంటించు!
జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. జగన్ యువత భవిష్యత్తుని దెబ్బతీశాడు.జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
మహిళల తాళిబొట్లు తాకట్టు!
జగన్ మహిళల తాళిబొట్లు తాకట్టు పెడుతున్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఎం అయ్యింది? సొంత బ్రాండ్లు అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. జగన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది.
కోడుమూరులో షాడో ఎమ్మెల్యే అరాచకం
కోడుమూరు నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్లు నియోజకవర్గాన్ని కేకు ముక్కలా కోసుకొని భూములు, ఇసుక, ఎర్రమట్టి దోచుకుంటున్నారు. ఇది ఎస్సి రిజర్వ్డ్ నియోజకవర్గం. కానీ ఇక్కడ పెత్తనం అంతా షాడో ఎమ్మెల్యేదే. నియోజకవర్గంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్యాలి అన్నా షాడో ఎమ్మెల్యే కి 10 శాతం కప్పం కట్టాల్సిందే. కోడుమూరు కొండరాయుడు కొండను వైసిపి ఎర్రమట్టి మాఫియా అడ్డంగా తవ్వేసింది. తుంగభద్ర నదిలో సి.బెళగల్ మండలం ఈర్లదిన్నె, సింగవరం, ముడుమాల, పలదొడ్డి గ్రామాల వద్ద ఇసుక రీచులు నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్నాడు షాడో ఎమ్మెల్యే. ఎమ్మెల్యే బంధువు సి. బెళగల్ జడ్పీటీసీ సభ్యుడు గిరిజోన్ ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణాలో సిద్ధహస్తుడు. అంగన్వాడీ ఉద్యోగాలను సైతం ఈ ఎమ్మెల్యే వదలలేదు. ఒక్కొ పోస్టుకు రూ.3-5 లక్షల వరకు వసులు చేశారు. విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ ఆపరేటర్ పోస్టుకు రూ.5 లక్షలు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ నియమించాలంటే రూ.2 లక్షలు, ఆశా వర్కరుకు రూ. 1.50 లక్షలు వసులు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ప్రైవేటు భూములను కూడా వదలడంలేదు!
హైదరాబాద్ లో ఉంటున్న నిడ్డూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి చెందిన 8 ఎకరాల భూమిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి కొట్టేసారు. ఆ భూమి విలువ 7 కోట్లు. కర్నూలు శివారులో బి.తాండ్రపాడు గంగమ్మ చెరువునే అక్రమించారు. రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. ఇందులో ఎమ్మెల్యేకి కోట్లల్లో ముడుపులు అందాయని అంటున్నారు. కర్నూలు మండలం తొలిసాపురం గ్రామంలో 90 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి స్కెచ్ వేసారు. ఆ భూమిని వేరే వాళ్లకు అమ్మేయడానికి ప్రణాళిక కూడా సిద్ధం చేసారు. పసుపుల గ్రామంలో 7 ఎకరాల్లో దళితులు, బీసీ, ముస్లిం మైనార్టీలు 15 ఏళ్లకు పైగా జీవిస్తుంటే.. ప్రైవేటు భూమి అని ఓ వైసీపీ నాయకుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రూ.25 కోట్లు విలువైన భూమి ఇది. ఇందులో ఎమ్మెల్యేకి వాటాలు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక నుండి లిక్కర్ తెచ్చి కోడుమూరు లో అమ్మేస్తున్నారు ఎమ్మెల్యే,షాడో ఎమ్మెల్యే అనుచరులు.
జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
జగన్ పాదయాత్ర లో కోడుమూరు వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చాడు. కోడుమూరు, గోరంట్ల నుంచి కొత్తపల్లి గ్రామాలు కలుపుతూ హంద్రీ నదిపై వంతెన నిర్మాణం చేస్తామని జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ఇప్పటి అమలు కాలేదు. అధికారంలోకి రాగానే గుండ్రేవుల జలాశయం నిర్మిస్థానని జగన్ హామీ ఇచ్చాడు. ఆ హామీ గాల్లో కలిసిపోయింది. TDP హయాంలో గుండ్రేవుల ప్రాజెక్టు కోసం డిపిఆర్ సిద్ధం చేసి ప్రాజెక్ట్ నిర్మాణం పనులకు సంబంధించిన జీ. ఓ ను కూడా విడుదల చేయగా ఇప్పటివరకు ఊసే లేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తీ అయితే లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ , పాలిటెక్నికల్, ఐటిఐ కాలేజ్ లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మర్చిపోయారు. గూడూరు నగర పంచాయితీ నందు 200 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నేరవేర్చలేదు.
కోడుమూరును అభివృద్ధి చేసింది టిడిపినే!
కోడుమూరు లో గెలవకపోయినా అభివృద్ధి చేసింది టిడిపి. నియోజకవర్గంలో సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసింది టిడిపి. గ్రామాల్లో సిసి రోడ్లు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టిడిపి. కోడుమూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గాజులదిన్నె జలాశయం నుంచి ప్రత్యేక పైపులైన్ తాగునీరు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. కోడుమూరు సహా వివిధ గ్రామాలకు తాగునీటి కోసం హంద్రీనీవా కాలువ ద్వారా ఒక టీఎంసీ నీటిని కేటాయించిన ఘనత టీడీపీదే. రూ.70 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకానికి టీడీపీ రూపకల్పన చేసింది. జగన్ వచ్చాక ఆ పథకం ఊసే లేదు. కోడుమూరు మండలం గోరంట్ల – కొత్తపల్లి మధ్య హంద్రీ నదిపై వంతెన నిర్మాణం చేయాలనే ప్రజలు కోరుతున్నారు. కోడుమూరు, కృష్ణగిరి మండలాల్లో 35 గ్రామాలకు రవాణాకు ఆధారం. శంకుస్థాపన చేసి వదిలేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వంతెన నిర్మాణం చేపడతాం.
టిడిపి అధికారంలోకి వచ్చాక రోడ్లు వేస్తాం!
కోడుమూరు – గూడూరు పట్టణాలను కలుపుతూ వయా చనుగొండ్ల మీదుగా 10 కి. మీలు ప్రధాన రోడ్డు అధ్వానంగా మారింది. నియోజకవర్గంలో మెజార్టీ గ్రామాల రోడ్లు పరిస్థితి ఇలాగే ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు వేస్తాం. గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా కృష్ణదొడ్డి, సంగాల, కంబదహాల్, చింతమాన్ పల్లె, రేమట ఎత్తిపోతల పథకాలకు జగన్ నిర్వాహణ నిధులు కూడా ఇవ్వలేదు. రైతులే చందాలు వేసుకొని మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ప్రాజెక్టుల మరమత్తులు పూర్తి చేస్తాం. కర్నూలు నుంచి సుంకేసుల వయా మునగాలపాడు రోడ్డు ఆధునీకరణకు టీడీపీ ప్రభుత్వం రూ.25 కోట్లతో పనులు ప్రారంభించాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు ఆపేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు పూర్తిచేస్తాం. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. టిడిపి కార్యకర్తలను వేధించిన వైసిపి వాళ్ళను వదిలిపెట్టను వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా.
ఒక్క తాగునీటి కుళాయి అయినా వేశావా జగన్?!
పుట్టపాశం గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించి వైసిపి ప్రభుత్వం పాడుబెట్టిన రక్షిత మంచినీటి పథకం ట్యాంకు వద్ద సెల్ఫీ దిగిన లోకేష్ పదునైన వాగ్భాణాలు సంధించారు. రాయలసీమ పల్లెల్లో 10రోజులకు ఒకసారి కూడా గుక్కెడు నీళ్లందక ప్రజలు పడుతున్న అవస్థలు చూసి నా కళ్లు చెమరుస్తున్నాయి. సీమజనం పడుతున్న తాగునీటి కష్టాలకు ఈ ప్లాస్టిక్ బిందెలే నిదర్శనం. రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్ తాడేపల్లి ప్యాలెస్ కూర్చుని ప్రజలను గాలికొదిలేశారు. ఇది ఎమ్మిగనూరు నియోజకవర్గం పుట్టపాశం గ్రామంలో రక్షిత మంచినీటి పథకం. నియోజకవర్గంలో నీటికష్టాలు తీర్చాలని టిడిపి హయాంలో ఇటువంటి 11 రక్షిత మంచినీటి పథకాలను రూ.13.5కోట్లతో నిర్మించాం. వైసిపి ప్రభుత్వం వచ్చాక గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైప్ లైన్లు వేసి నీరివ్వడం చేతగాక పాడుబెట్టారు. అధికారంలోకి వచ్చాక దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఒక్క మంచినీటి కుళాయి అయినా వేశావా జగన్మోహన్ రెడ్డీ అంటూ ఎండగట్టారు.
మేం సిసి రోడ్లు వేశాం… నువ్వేం చేశావు?!
ఇది ఎమ్మిగనూరు నియోజకవర్గం పుట్టపాశం దళితవాడలో మేం నిర్మించిన సిసి రోడ్డు తాలూకు శిలాఫలకం. నేను పంచాయితీరాజ్ మంత్రిగా పనిచేసిన రెండున్నరేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు వేశాను. నాలుగేళ్ల జగన్ రెడ్డి గారి జమానాలో కొత్తరోడ్ల నిర్మాణం మాట దేవుడెరుగు, గోతుల్లో తట్ట మట్టిపోసే దిక్కులేదు. వర్షం వస్తే రోడ్లు తటాకాలను తలపిస్తున్నాయి. రోడ్లువేయడానికి టెండర్లు పిలచినా జగన్ మొఖం చూసి కాంట్రాక్టర్లు పరారవుతున్నారు. దిక్కుమాలిన పాలనతో జనానికి చుక్కలు చూపిస్తూ రాజుగారి ఒంటిమీద దేవతా వస్త్రాల మాదిరిగా అంతా బాగుందని డబ్బాలు కొట్టించుకోవడం వైసీపీ పాలనలో మాత్రమే సాధ్యమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
దెబ్బతిన్న మునగపంటను పరిశీలించిన లోకేష్
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు నియోజకవర్గం గాజులదిన్నెలో అకాలవర్షాల కారణంగా దెబ్బతిన్న మునగపంటను పరిశీలించిన యువనేత లోకేష్, రైతు నాగిరెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా రైతు నాగిరెడ్డి తమ గోడు విన్పిస్తూ… ప్రకాశం జిల్లా నుండి వచ్చి గాజులదిన్నెలో 5 ఎకరాలు కౌలు కి తీసుకొని మునగతోట వేశాను. అకాల వర్షాలతో చెట్లు మొత్తం పడిపోయాయి, పూత రాలిపోయింది. విత్తనం, ఎరువులు, పురుగుల మందులు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే 50 వేలు మాత్రమే వచ్చింది. గత నాలుగేళ్లుగా పంట నష్ట పరిహారం అందలేదు. రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. పంట నష్ట పరిహారం అందకపోతే వ్యవసాయం కొనసాగించలేని పరిస్థితి ఉంది. కౌలు రైతులకు ఎటువంటి సాయం అందడంలేదు.
యువనేత లోకేష్ మాట్లాడుతూ…
జగన్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వం. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతే సిఎం జగన్ కి కనీసం సమీక్ష చేసే ఖాళీ లేదు. అసలు పంట నష్టం అంచనా కూడా వేసే పరిస్థితి లేదు. టిడిపి హయాంలో నష్టం అంచనా, పరిహారం సమయానికి అందించాం. ఉన్న క్రాప్ ఇన్స్యూరెన్స్ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. విత్తనం దగ్గర నుండి పురుగుల మందుల వరకూ అన్ని రేట్లు జగన్ పాలనలో విపరీతంగా పెరిగిపోయాయి. అకాల వర్షాలతో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం ఇప్పుడైనా మొద్దు నిద్ర వీడి రైతులను ఆదుకోవాలి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి వ్యయం తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. భూమి యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేస్తాం.
యువనేతను కలిసిన మత్స్యకారులు
ఎమ్మిగనూరు నియోజకవర్గం గాజులదిన్నెకు చెందిన మత్స్యకారులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. గతంలో మాకు సబ్సిడీపై వలలు, ఫైబర్ తెప్పలు, బోట్లు ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో అవేమీ ఇవ్వడం లేదు. వర్షాలు వచ్చినపుడు గాజులదిన్నె చెరువులో చేపలు కొట్టుకుపోతున్నాయి. ఎటువంటి నష్టపరిహారం ఇవ్వడం లేదు. సముద్రాలు, నదుల్లో చేపలు పట్టే మత్స్యకారులకు మాదిరిగానే మాకు కూడా భరోసా కల్పించాలి. ప్రమాదవశాత్తు చనిపోతే బీమా సౌకర్యం కల్పించాలి.
యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ…
సాంప్రదాయంగా చేపలవేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల పొట్టగొట్టే విధంగా వైసీపీ ప్రభుత్వం 217 జిఓ తీసుకువచ్చింది. ఈ జిఓ ద్వారా మత్స్యకారుల చేపలచెరవులను వైసిపి నేతలు స్వాధీనం చేసుకుంటున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు గతంలో మాదిరి సబ్సిడీపై వలలు, బోట్లు, ఫైబర్ తెప్పలు అందజేస్తాం. సముద్రం, నదుల్లో మత్స్యకారులకు మాదిరిగానే చేపలవేటపై ఆధారపడిన మత్స్యకారులందరికీ పథకాలను వర్తింపజేస్తాం. ప్రమాదబీమా సౌకర్యం కల్పిస్తాం.
యువనేతను కలిసిన గాజులదిన్నె ప్రాజెక్టు ముంపు రైతులు
యువనేత లోకేష్ కు గాజులదిన్నె ప్రాజెక్ట్ ముంపు రైతులు వినతిపత్రం సమర్పించారు. గోనెగండ్ల మండలం ఐరన్ బండ-A,ఎన్నెకండ్ల, గంజిహళ్ళి,గోనెగండ్ల, నేరుడుప్పల గ్రామాల రైతులు 1977లో గాజులదిన్నె ప్రాజెక్ట్ కట్టడానికి 5వేల ఎకరాల భూమి ఇచ్చారు. ప్రస్తుతం మిగిలిన ఒకటి,రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాం. తాజాగా గాజులదిన్నె ప్రాజెక్ట్ ఎత్తు పెంచాలని ప్రస్తుత ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కమీషన్ల కోసం వైసిపి నాయకులు ప్రాజెక్టు ఎత్తు పెంచే పనులు మొదలుపెట్టారు. ముంపు రైతుల సమస్యలు గాలికొదిలేశారు. మా గ్రామంలో ఎకరా భూమి మార్కెట్ ధర రూ.30లక్షల వరకు ఉంది. ముంపునకు గురి అయినా భూములకు కేవలం రూ. 4.2లక్షలు మాత్రమే పరిహారం ఇస్తామంటున్నారు. మాకు కనీసం ఎకరాకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలి. జిఓ నెం.98 ప్రకారం ప్రతి ఇంటికి ఒక ఉధ్యోగం, పునరావాసం కింద రూ.4లక్షల రూపాయల సాయం అందజేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందించాల్సి ఉంది. ప్రభుత్వమే చట్టవిరుద్దంగా ఇష్టానుసారం రైతుల భూమి లాక్కోవడం కుదరదు. భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందించాల్సిందిగా ప్రభుత్వానికి లేఖరాస్తాం. గాజులదిన్నె ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు అండగా నిలుస్తాం.
లోకేష్ ను కలిసి కైరవాడి గ్రామ ఉల్లి రైతులు
ఎమ్మిగనూరు నియోజకవర్గం కైరవాడి గ్రామ ఉల్లి రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో దాదాపు 4వేల ఎకరాల వ్యవసాయ భూమిలో 75శాతం ఉల్లి పంట పండిస్తున్నాం. జిల్లాలో ఉల్లి పంటలో మా గ్రామం మొదటిస్థానంలో ఉండేది. గత నాలుగేళ్లుగా గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాయం. ఈ సంవత్సరం ఉల్లి పంటకు క్రాప్ హాలిడే ప్రకటించాం. గత ప్రభుత్వంలో ఉల్లి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకునేది. వైసీపీ వచ్చాక మా వద్ద పంట కొనుగోలు చేయడం లేదు. దీంతో ఉల్లి రైతులంతా అప్పుల్లో మునిగిపోయారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఉల్లికి కనీస మద్దతు ధర రూ.2వేలు ప్రకటించి ఆదుకోవాలి.
యువనేత లోకేష్ స్పందిస్తూ…
రాష్ట్రంలో రైతాంగాన్ని ముఖ్యమంత్రి గాలికొదిలేశారు. వ్యవసాయ రంగంపై కనీస అవగాహన లేని సిఎం జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్ అసమర్థత, చేతగానితనం కారణంగా నాలుగేళ్లలో రాష్ట్ర రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. జగన్ నిర్వాకం వల్ల 3వేల మంది రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానం, కౌలురైతుల ఆత్మహత్యలో 2వ స్థానం, అత్యధికంగా అప్పులున్న రైతుల్లో 1వ స్థానంలోకి చేర్చారు. రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి పత్తాలేకుండా పోయారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఉల్లిరైతులను ఆదుకుంటాం. ప్రతి పంటకు కనీస మద్దతు ధర అందిస్తాం. రైతుల నుండి ప్రభుత్వమే పంట కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం.
యువనేతను కలిసిన గోనెగండ్ల, సి.బెళగల్ రైతులు
ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల, సి.బెళగల్ మండలాల రైతులు యువనేత నారా లోకేష్ ను కలసి వినతిపత్రం సమర్పించారు. మా రెండు మండలాల పరిధిలో ఎల్.ఎల్.సీ కాలువ కింద 5,500ఎకరాల ఆయకట్టు ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఎల్.ఎల్.సీ కాలువలో జరిగే జలచౌర్యం వల్ల మా పొలాలకు నీరు అందడం లేదు. తీవ్రమైన నీటి కొరత ఏర్పాడుతోంది. ఎల్.ఎల్.సీ, గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ) ఎడమ కాలువ సమాంతరంగా ప్రవహిస్తాయి. గతంలో జిడిపి కాలువను తవ్వి నీటిని ఎల్.ఎల్.సీ కాలువలోకి వదిలి పంటలను కాపాడుకునేవాళ్లం. జిడిపి కాలువ కింద సాగుచేసే రైతులు అభ్యంతరం వ్యక్తం చేసి మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు. జిడిపి, ఎల్.ఎల్.సీ కాలువల అనుసంధానంపై రైతులు ఎంతోకాలం నుండి పోరాడుతున్నా ఎవరూ స్పందించడం లేదు. 2018లో జిడిపి, ఎల్.ఎల్.సీ కాలువలను అనుసంధానం చేసేందుకు రూ.25లక్షలు మంజూరు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు నిలిచిపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చాక ఈ రెండు కాలువలను అనుసంధానం చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి.
యువనేత లోకేష్ స్పందిస్తూ…
సమస్య తలెత్తినపుడు పరిష్కరించడం మాని గొడవలుపెట్టి తమాషా చూడటం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. అధికారంలోకి వచ్చాక ఒక్క తాగు, సాగునీటి ప్రాజెక్టు పూర్తిచేయలేని జగన్ ప్రభుత్వం రైతుల మధ్య వివాదాలు సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని సమస్యలు వైసిపి ప్రభుత్వంలోనే ఎందుకు వస్తున్నాయో అందరూ ఆలోచించాలి. ఇరువర్గాల రైతులతో మాట్లాడి జిడిపి, ఎల్ఎల్ సి కాల్వలను అనుసంధానించి రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తాం. అధికారంలోకి వచ్చాక ఆర్ డిఎస్ కుడికాల్వ, ఎల్ఎల్ సి ఆధునీకరణ పనులు పూర్తిచేస్తాం.
యువనేతను కలిసిన వేముగోడు గ్రామస్తులు
ఎమ్మిగనూరు నియోజకవర్గం వేముగోడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నివించారు. మా గ్రామం పక్కనే హంద్రీనీవా నది ఉన్నా మా గ్రామంలో మంచినీటి కొరత ఉంది. టీడీపీ పాలనలో నదిలో రెండు బోర్ మోటార్లతో నీటిని తోడి నీరు సరఫరా చేసేవారు. వైసీపీ పాలనలో ఒక్క మోటార్ తోనే నీటిని ఇస్తుండటంతో సరిపోవడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక మూడు బోర్లు, ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటుచేసి సమస్య పరిష్కరించాలి. మా గ్రామం నుండి చిన్నాటూర్ గ్రామం మధ్య రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. రెండు గ్రామాల మధ్య రోడ్డు నిర్మించాలి. గ్రామంలో కొన్ని వీధుల్లో సీసీ రోడ్లు లేవు. రోడ్ల నిర్మాణం చేపట్టాలి.
యువనేత లోకేష్ స్పందిస్తూ…
రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాంతప్రజలకు కనీసం గుక్కెడు నీళ్లు అందించలేకపోతున్నారు. మంత్రుల నియోజకవర్గాల్లో కూడా 10రోజులకు ఒకసారి మంచినీరు వచ్చే పరిస్థితులున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజాసమస్యలు పట్టడం లేదు. టీడీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్లు సీసీరోడ్లు నిర్మించాం. మళ్లీ టిడిపి అధికారంలోకి వచ్చాక మోటార్ల ద్వారా హంద్రీనీవా నుండి వేముగోడుకు మంచినీరు అందిస్తాం. ఇంటర్నల్ రోడ్లు, సిసి రోడ్ల నిర్మాణం చేపడతాం.
యువనేతను కలిసి భూరక్ష కష్టాలు విన్పించిన రైతు
ఎమ్మిగనూరు నియోజకవర్గం కైరవాడి గ్రామ రైతు శ్రీనివాసులు భూరక్ష సర్వే పేరుతో ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను యువనేత లోకేష్ దృష్టికి తెచ్చారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన భూరక్ష సర్వే పథకం రైతుల పాలిట శాపంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల మధ్య ఈ పథకం చిచ్చుపెడుతోంది. భూసర్వేలో లోపాలు రైతులపాలిట శాపాలుగా మారాయి. రైతులు పనులు మానేసి ఎమ్మార్వో, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రైతుల మధ్య చిచ్చుపెట్టే ఈ పథకాన్ని మీరు అధికారంలోకి వచ్చాక రద్దు చేయాలి.
యువనేత లోకేష్ స్పందిస్తూ…
జగన్ కు రాష్ట్రంలో ఏఒక్కరూ ప్రశాంతంగా ఉండటం ఇష్టంలేదు. భూరక్ష పేరు పథకం రైతుల భూములు కొట్టేసే భూభక్ష పథకంగా మారిపోయింది. వైసీపీ తెచ్చే ప్రతి స్కీం వెనుక భారీ స్కాం ఉంటోంది. భూములకు ఏర్పాటుచేసే హద్దురాళ్లలో సైతం జగన్ అవినీతికి పాల్పడ్డారు. టిడిపి అధికారంలోకి వచ్చాక వాస్తవ భూ అనుభవదారులను గుర్తించి భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. భూఆక్రమణల దారులపై ఉక్కుపాదం మోపి, రైతుల భూములకు రక్షణ కల్పిస్తాం.
యువనేతను కలిసిన పుట్టపాశం గ్రామస్తులు
ఎమ్మిగనూరు నియోజకవర్గం పుట్టపాశం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. 1996లో మా గ్రామం వరదల్లో మునిగిపోయింది. గ్రామాన్ని వదిలి వేరే ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు బిల్లులు ఇవ్వడం లేదు. అప్పులుచేసి ఇళ్లు కట్టుకుంటున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక మాకు పెండింగ్ బిల్లులు ఇప్పించాలి. మా ఇళ్లమీదుగా హైటెన్షన్ కరెంటు వైర్లు వెళ్తున్నాయి. వాటివల్ల గతంలో ఇద్దరు చనిపోయారు. ఆ వైర్లను తొలగించి మా ప్రాణాలు కాపాడాలి. మా గ్రామదేవత మాన్యం భూమిని కొంత మంది ఆక్రమించుకున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలి. మా గ్రామానికి పొలిమేర హద్దులు, సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి. ఉద్యోగాలు లేక మా గ్రామస్తులు ఇతర వలసలు వెళ్లిపోతున్నారు. మీరు వచ్చాక ఉద్యోగాలు కల్పించండి. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. కల్తీ విత్తనాలు, ఎరువులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్ అన్న చందంగా తయారైంది. రెండేళ్లలో 30లక్షల ఇళ్లు కడతామని ఆర్భాటంగా చెప్పిన జగన్, కట్టింది 55ఇళ్లు మాత్రమేనని ఇటీవల కేంద్రం నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పేదవాడి సెంటు పట్టాలో సైతం జగన్ రెడ్డి రూ.7వేల కోట్లు కొట్టేశారు. టిడిపి అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న పక్కా ఇళ్ల బిల్లులు చెల్లిస్తాం. పుట్టపాశం గ్రామానికి సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తాం.హైటెన్షన్ వైర్లను ఇళ్లపైనుంచి వెళ్లకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. పరిశ్రమలు ఏర్పాటుచేసి నిరుద్యోగ యువత వలసలను నివారిస్తాం. పెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం.
యువనేతను కలిసిన అలువాల గ్రామస్తులు
ఎమ్మిగనూరు నియోజకవర్గం అలువాల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో ఉన్న వాగులో వర్షాలు వచ్చినపుడు 1500 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. వాగు లోలెవల్ బ్రిడ్జిలో కంపచెట్లు, ఇతర వ్యర్థపదార్ధాలు ఇరుక్కుపోవడంతో నీళ్లు గ్రామంలోకి వస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. గతంలో భారీవర్షాల కారణంగా 5గురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. హైలెవల్ బ్రిడ్జి కోసం గత ప్రభుత్వం 2018లో రూ.కోటి మంజూరుచేసింది. తర్వాత ప్రాసెస్ అయి పనులు మొదలుపెట్టే లోపు ఎన్నికల కోడ్ వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో లో లెవల్ బ్రిడ్జి నిర్మించింది. దీంతో వర్షం వచ్చినపుడు గ్రామంలోకి నీళ్లు వస్తున్నాయి. వాగు గట్టువెంట రిటైనింగ్ వాల్, హైలెవల్ బ్రిడ్జి నిర్మించాల్సిందిగా విజ్జప్తి.
యువనేత లోకేష్ స్పందిస్తూ…
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులు, బ్రిడ్జిల నిర్వహణను గాలికొదిలేసింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61మంది అమాయకులు బలయ్యారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక అలువాల వాగువద్ద హైలెవల్ బ్రిడ్జి, రిటైనింగ్ వాల్ నిర్మిస్తాం. అలువాల గ్రామస్తుల ఎదుర్కొంటున్న ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.
యువనేతను కలిసిన వర్కూరు గ్రామస్తులు
కోడుమూరు నియోజకవర్గం వర్కూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. మా గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. నాలుగేళ్లుగా డ్రైనేజీలను శుభ్రం చేసేవారు లేరు. మురికినీరు ఇళ్లలోకి చేరి అంటువ్యాధుల బారిన పడుతున్నాం. గ్రామం పక్కనే హంద్రీనీవా నది ఉన్నా మాకు ఇసుక దొరకడం లేదు. వైసీపీ నాయకులు ఇసుకను అడ్డగోలుగా దోచుకుతింటున్నారు. తాగునీటి సమస్యలున్నా పట్టించుకునే వారు లేరు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
యువనేత లోకేష్ స్పందిస్తూ…
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పంచాయతీలన్నీ అలంకారప్రాయంగా మారాయి. పంచాయతీల నిధులు రూ.8,660కోట్లను జగన్ రెడ్డి దారిమళ్లించి గ్రామాలను నిర్వీర్యం చేశారు. గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేకపోవడంతో, జనం అనారోగ్యం పాలవుతున్నారు. వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా రాయలసీమలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. టీడీపీపాలనలో వేసిన రోడ్లను కూడా అక్రమ ఇసుక వ్యాపారాల కోసం ధ్వంసం చేశారు. మేం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడతాం. ఇసుక పాలసీని సరళీకరించి పేదవాడికి ఇసుకను అందుబాటులో ఉంచుతాం.
Also, read this blog: Empowering Communities Through the Action of Yuvagalam
Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh