ఆదోని నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం, అడుగడుగునా యువనేతకు జన నీరాజనం, నేడు 1000 కి.మీ. మైలురాయికి చేరనున్న యువగళం
ఆదోని: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 76వరోజు (గురువారం) ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. చినపెండేకల్ వద్ద ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ మీనాక్షి నాయుడు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎదురేగి పెద్దఎత్తున యువనేతకు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. మహిళలు యువనేతకు నీరాజనాలు పట్టగా, యువకులు బాణాసంచా కాలుస్తూ డప్పు శబ్ధాలతో హోరెత్తించారు. పెదపెండేకల్ శివారు ఎర్రచెరువువంక వద్ద ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లిన లోకేష్ పారతో మట్టితవ్వి కూలీల కష్టాలు తెలుసుకున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనిచేస్తే ఇచ్చే రూ.150రూపాయల కూలీ పెరిగిన ధరలవల్ల ఏమూలకు సరిపోవడంలేదని, కూలీ పెంచేలా ప్రయత్నించాలని కోరారు. అనంతరం ఆరేకల్లులో వాల్మీకి సామాజికవర్గీయులు యువనేతను కలిసి తమను ఎస్టీల్లో చేర్చాల్సిందిగా కోరారు. ఆరేకల్లులో గత ప్రభుత్వంలో రూ.7కోట్లతో పనులు ప్రారంభించగా, వైసిపి వచ్చాక నిలిపివేసిన ఉర్దూ ఐటిఐ రెసిడెన్షియల్ కాలేజి వద్ద సెల్ఫీ దిగిన లోకేష్… కొత్తపనులు చేపట్టడం చేతగాదు, పాతపనులు కూడా పూర్తిచేయడం రాని దద్దమ్మ ముఖ్యమంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భోజనవిరామ సమయంలడో నాగలాపురం వద్ద యువతతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న లోకేష్ టిడిపి అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు తెచ్చి కర్నూలు జిల్లాలో వలసలను నివారిస్తామని భరోసా ఇచ్చారు. 77వరోజున (శుక్రవారం) ఆదోనిలోని అడిగుప్పక్రాస్ వద్ద యువగళం పాదయాత్ర 1000 కి.మీ. మైలురాయిని చేరుకోనుంది.
యువనేత ఎదుట వ్యక్తమైన అభిప్రాయాలు:
గ్రామం కోసం రూ.8 లక్షలు సొంత డబ్బు ఖర్చు చేశా! -జి.సుధాకర్, ఎమ్.డి.హల్లి గ్రామం, హోలగుంద మండలం
25 ఏళ్ల వయసులో సర్పంచ్ గా గెలిచా. చదువుకున్న వ్యక్తినని నన్ను ప్రజలు సర్పంచ్ ని చేశారు. కానీ గ్రామాభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. పంచాయతీ ఖాతాలో పడిన రూ.40 లక్షలు విద్యుత్ బకాయిల కింద ప్రభుత్వం లాక్కుంది. మరో రూ.10 లక్షలు పడతాయి అవికూడా స్వచ్ఛభారత్ కార్మికులకు చెల్లించాలి, వారికి ఏడాది నుండి జీతాలు ఇవ్వలేదని అధికారులు చెప్తున్నారు. నీటిబోర్లు, పారిశుధ్యం, విద్యుత్ దీపాలు వంటి మౌళిక సదుపాయాలకు రూ.8లక్షలు సొంత డబ్బును ఖర్చు చేశా. గ్రామస్తులకు నా మొహం చూపించాలంటే సిగ్గుగా ఉంది. వారు చెప్పిన సమస్యలు తీర్చలేకపోతున్నందుకు బాధేస్తోంది.
ఒంటరి మహిళను..పెన్షన్ లేదు..ఇళ్లూ లేదు-మంగళం నాగేంద్రమ్మ, చిన్నపెండేకల్
నా భర్త నన్ను వదిలి మరో పెళ్లి చేసుకున్నాడు. నాకు ఒక కూతురు ఉంది. ఒంటరి మహిళ పెన్షన్ కోసం అప్లై చేస్తే ఇవ్వడం లేదు. నా కూతురును 10వ తరగతి వరకు చదవించి మాన్పించాను. నాకు సొంతంగా పొలం, ఇళ్లు కూడా లేదు. నెలకు రూ.వెయ్యి ఇచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నా. కూలీ పనులు చేస్తే వచ్చే డబ్బు పూటగడుపుకునేందుకు సరిపోతుంది. బతుకు బండి లాగడం కష్టంగా ఉంది.
*మైనారిటీలపై వైసీపీ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష ?!*
రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు సాక్షీభూతం… అర్థంతరంగా నిలచిపోయిన ఈ కళాశాల నిర్మాణం. ఆదోని నియోజకవర్గం ఆరేకల్లులో ప్రభుత్వ మైనార్టీ ఉర్ధూ ఐటీఐ రెసిడెన్షియల్ కాలేజీకి TDP ప్రభుత్వం హయాంలో రూ.7 కోట్లు నిధులు కేటాయించి, నిర్మాణపనులు కూడా ప్రారంభించాం. వైసిపి ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లుగా ఈ నిర్మాణాలను అంగుళం కూడా ముందుకు సాగనీయకుండా పాడుబెట్టారు. కొత్తగా పనులు చేపట్టడం ఎలాగూ చేతగాదు… గతంలో ప్రారంభించిన పనులైనా పూర్తి చేయలేని ముఖ్యమంత్రి అంటూ లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ల్యాండ్ స్కామ్ ఆధారాలు ఇవిగో…! మంత్రికి నారా లోకేష్ సవాల్
మంత్రి అవినీతి చిట్టాను యువనేత నారా లోకేష్ బయటపెట్టారు. ల్యాండ్ స్కాం కి సంబంధించిన ఆధారాలు విడుదల చేశారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి భూములు కొట్టేసిన క్రమాన్ని విధానాన్ని బహిర్గతం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను లోకేష్ తెలియజేస్తూ…180 ఎకరాల ఇటినా భూములు మంత్రి కాజేశారు. కమర్షియల్ ల్యాండ్ గా ఉన్న భూమిని వ్యవసాయ భూములుగా చూపి తన కుటుంబం పేర రిజిస్ట్రేషన్ చేయించారు. రూ.45 కోట్లు విలువైన భూమిని రూ.2 కోట్లు ప్రభుత్వ వాల్యూ చూపించి కారు చౌకగా కొట్టేసిన ఘనుడు మంత్రి. వ్యవసాయం లో లాభం వచ్చింది అన్న మంత్రి గారు ప్రభుత్వం నుండి పంట నష్టపరిహారం ఎందుకు తీసుకున్నారు? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నిభందనలు మంత్రి, ఆయన కుటుంబం అతిక్రమించి భూములు కొనుగోలు చేశారు. భూములు అమ్మిన మంజునాథ్ సేల్ డీడ్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు? అసలు ఆ భూములు అమ్మే హక్కు అతనికి లేదు కాబట్టి సేల్ డీడ్ రద్దు చేసుకున్నాడు. ఐటి బినామీ యాక్ట్ ప్రకారం మంత్రి అడ్డంగా దొరికిపోయారు.
కుటుంబ భూముల ద్వారా వచ్చిన ఆదాయంతో ఇటినా భూములు కొన్నానంటున్న మంత్రి…కుటుంబ భూముల గురించి ఎన్నికల ఎఫిడవిట్ లో ఎందుకు చూపలేదు?ప్రభుత్వ ధర ప్రకారం ఎవరైనా ముందుకు వస్తే భూములు రైతులకు వెనక్కి ఇస్తాం అన్న మంత్రి గారు ఇప్పుడు ఎందుకు మాట మార్చారు? ప్రభుత్వ ధర ప్రకారం ఆ భూములు కొని రైతులకు పంచుతానని నేను అంటే దానికి స్పందించకుండా అర్దం లేని ఆరోపణలు చేస్తూ అసభ్య పదజాలంతో తిట్టడం ఎంత వరకూ సబబు? నేను నేరుగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే దైర్యం లేకే బూతులు తిడుతున్నారు. ఐటి డిపార్ట్మెంట్ కి అడ్డంగా దొరికిపోయి నీతులు మాట్లాడటం మంత్రికే చెల్లింది. మంత్రి గారూ… మీకు దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు వందల ఎకరాల అధిపతి అయ్యారు? ఇక్కడ ఉన్న ఒక్క వాల్మీకి కుటుంబం అయినా ఒక ఎకరం భూమి కొనే స్థితిలో ఉన్నారా? మీరు బెంజ్ కారు కొన్నారు. ఇక్కడ ఉన్న వాల్మీకి సోదరులు ఒక్క చిన్న కారు అయినా కొనే స్థితిలో ఉన్నారా? రైతులకి భూములు రాసిస్తా అని అన్నారు. దానికి మేము సిద్దం. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం? ఈసారైనా సబ్జెక్ట్ తో మీడియా ముందుకు రావాలని యువనేత లోకేష్ సవాల్ విసిరారు.
అధికారంలోకి వచ్చాక కర్నూలుకు పరిశ్రమలు తెస్తాం, ఉద్యోగావకాశాలు కల్పించి వలసలను నివారిస్తాం, ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని పునరుద్దరిస్తాం. 100వరోజు పాదయాత్రలో యువత మేనిఫెస్టో ప్రకటిస్తాం, యువతతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్
ఆదోని: ఆదోని నియోజకవర్గం నాగలాపురంలో యువతతో ముఖాముఖి సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన ఏ హామీని జగన్ అమలు చేయలేదు. యువత ప్రశ్నిస్తారనే భయంతో పరదాల చాటున, పోలీసులను అడ్డుపెట్టుకుని తిరుగుతున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కేజీ టు పీజీ వరకు ఉన్న సబ్జెక్టులను మారుస్తాం, విద్యారంగాన్ని ప్రక్షళన చేస్తాం. చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగలు వచ్చేలా సిలబస్ ను మారుస్తాం. ఫీజు రీయింబర్స్ మెంట్ ను పునరుద్ధరించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తాం. వైసీపీ పాలనలో ఫీజు రీయింబర్స్ రద్దు వల్ల ఫీజులు కట్టలేక కోర్సు పూర్తిచేసి, కాలేజీలోనే సర్టిఫికెట్లు వదిలేసిన విద్యార్థులకు మేం అధికారంలోకి వచ్చాక కాలేజీలకు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద ఫీజులు కట్టి సర్టిఫికెట్లు ఇప్పిస్తాం.
100వరోజు యువత మేనిఫెస్టో ప్రకటిస్తాం
నా పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకు నేను ఓ హామీ ఇస్తున్నా. నాపాదయాత్ర 100వ రోజు యువతకు సంబంధించిన మ్యానిఫెస్టోను విడుదల చేయబోతున్నాం. చంద్రబాబు ఉద్యోగాలు కల్పించేదానిపై దృష్టి పెడతారు. చంద్రబాబు పాలనలో 6లక్షల ఉద్యోగాలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 100కు పైగా పరిశ్రమలు రాష్ట్రం నుండి పారిపోయాయి. ఏపీ అభివృద్ధి కేవలం తెలుగుదేశం పాలనలోనే జరిగింది. వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది. హైదరాబాద్ లో చంద్రబాబు ఐటీని ప్రోత్సహించడం వల్ల నేడు ఐటీ హబ్ గా వెలుగొందుతోంది. వైసీపీ ప్రభుత్వం మరోసారి గెలిస్తే దక్షిణభారత దేశ బీహార్ గా ఏపీ మారుతుంది. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి దోచుకునే పనిలోనే ఉన్నాడు జగన్. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీ ఓటే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎవరు గెలిస్తే మీకు భవిష్యత్తు ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జీఎస్టీ కలెక్షన్ లో మనం ఒరిస్సా కంటే వెనుకబడి ఉన్నాం. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ఐదేళ్ల పాలనలో మన రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. మరోమారరు వైసీపీ మాయమాటలు వింటే ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేదు.
కర్నూలుకు పరిశ్రమలు తెస్తాం!
ఉమ్మడి కర్నూలు జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఆధోనిలో మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మిస్తాం. కర్నూలు నుండి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే విధానానికి ఫుల్ స్టాప్ పెడతాం. ఐటీ ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కు వెళ్లకుండా ఏపీలోనే ఉద్యోగాలు చేసేలా ఐటీ కంపెనీలను తెస్తాం. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తాం. యువతకు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం. నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మహిళల భద్రతకు కావాల్సిన చర్యలు చేపడతాం. చిన్న నాటి నుండే పాఠశాలల్లో మహిళల పట్ల గౌరవం, మర్యాద అలవడేలా పాఠ్యాంశాలు రూపొందిస్తాం. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మరణమే శరణమనేలా చట్టాలను కఠిన తరం చేస్తాం. వైసీపీ పాలనలో దిశ చట్టం పేరుతో మహిళలను మోసం చేస్తున్నారు. దిశ చట్టం లేకుండానే పోలీసు స్టేషన్లు, వాహనాలు తిప్పుతున్నారు. యాప్ తో మహిళల కళ్లు కప్పుతున్నారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన వారు దర్జాగా బెయిల్ పై వచ్చి రోడ్లపై తిరుగుతున్నారు.
విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని జగన్ కట్ చేశాడు. పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశీవిద్య, బెస్ట్ అవెయిలబుల్ స్కూల్ పథకాలను కూడా కట్ చేశాడు ముఖ్యమంత్రి మెగా డీఎస్సీ హామీని కూడా కట్ చేశాడు. 2019 ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ గాలికొదిలేశాడు. పాఠశాలలను మెర్జ్ చేసి, ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీలు లేవని చెప్పాడు. మేం అధికారంలోకి వచ్చాక విద్యావిధానాన్ని ప్రక్షాళన చేస్తాం. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం. ప్రతియేటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాం. గత ప్రభుత్వంలో అన్ని జిల్లాలను సమాంతంరంగా పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేశాం. అభివృద్ధి వికేంద్రీకరణను తెలుగుదేశం ప్రభుత్వంలో చేసి చూపించాం. గతంలో కర్నూలుకు మేం మెగాసీడ్ పార్క్ తెస్తే, వైసీపీ ప్రభుత్వం దాన్ని తరిమేసింది.
యువత హక్కుల కోసం పోరాడాలి
యువత తమ హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడాలి. నా పాదయాత్రలో కూడా ప్రభుత్వం నాపై అనేక విధాలుగా నిర్బంధాలు విధించడం ప్రారంభమైంది. అయినా నా పోరాటం ఆగలేదు. చివరకు ప్రభుత్వమే వెనక్కి తగ్గింది. దానికోసం మనం పోరాడాలి. విద్యార్థులు, యువత ఒక్కటై టీడీపీని గెలిపించాలి. కార్పొరేషన్ల ద్వారా ఒక్క సబ్సిడీ లోన్ ఇవ్వలేదు. అలాగే ఇన్నోవా, జేసీబీ, ఆటోలు ఏమీ ఇవ్వలేదు. పరిశ్రమల శాఖ మంత్రి ఒక్క పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాలేదు. పరిశ్రమల గురించి ప్రశ్నిస్తే కోడి-గుడ్డు అంటూ కాలాక్షేపం చేస్తున్నాడు. జగన్ హయాంలో స్టడీ సర్కిళ్లను కూడా రద్దు చేశాడు. చంద్రబాబు పాలనలో యువతకు అవకాశాలు కల్పించాలని భావించి అనేక పథకాలు అమలు చేశారు. మేం అధికారంలోకి వచ్చాక వాటిని పునరుద్ధరిస్తాం.
నెలకో తేదీ చెప్పి మోసగిస్తున్నాడు
మన రాష్ట్రానికి గత నాలుగేళ్లుగా రాజధాని లేకుండా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. నెలకొక తారీఖు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడు. చంద్రబాబు పాలనలో నాలుగేళ్లలో హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీని నిర్మించారు. రాజధానిలో ఉద్యోగుల భవనాలను దాదాపు పూర్తిచేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని ఎక్కడో ఎవరికీ తెలియదు. ఎక్కడా ఒక్క ఇటుక కూడా వేయలేదు. మేం నిర్మించిన రోడ్లపైనే ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు. కర్నూలు న్యాయ రాజధాని అన్నారు. కనీసం ఒక్క ఇటుకైనా వేశారా? అమరావతి, వైజాగ్ లలో దోచుకోవడం తప్ప, రాజధాని నిర్మాణాలు ఎక్కడా లేవు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ వస్తే మన రాజధాని అమరావతిగా ముందుకు దూసుకుపోతుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి చాలా చరిత్ర ఉంది. సిద్ధార్థ ప్రైవేటు మెడికల్ కాలేజీని ఎన్టీఆర్ కష్టపడి ప్రభుత్వ రంగంలోకి తెచ్చారు. ఆ యూనివర్శిటీకి ఎన్టీఆర్ అని చంద్రబాబు పేరు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేరు మార్చడం వల్ల దానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. మేం అధికారంలోకి వచ్చాక డాక్టర్.ఎన్టీఆర్ వర్శిటీ పేరును పునరుద్ధరిస్తాం. అబ్ధుల్ కలా వ్యూ పాయింట్ కు జగన్ మార్చిన పేరును రద్దు చేసి పాత పేరునే పునరుద్ధరిస్తాం.
యువతతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:
మల్లిఖార్జున్: ఫీజు రీయింబర్స్ మెంట్ రావడం లేదు. ఫీజులు కట్టమని మేనేజ్ మెంట్ ఒత్తిడి చేస్తున్నారు. చేతి డబ్బులే కడుతున్నాను. మీరు వచ్చాక మాకు రీఎంబర్స్ మెంట్ ఇచ్చి ఆదుకోండి.
ముంతాజ్, ఆదోని: వైసీపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ ఇస్తానని మోసం చేసింది. మీరు వచ్చాక మెగా డీఎస్సీ ప్రకటించండి.
రామరాజు, కర్నూలు: నేను గ్రూప్-2 కు గత నాలుగేళ్లుగా ప్రిపేర్ అవుతున్నాను. కానీ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. మీరు వచ్చాక నోటిఫికేషన్ ఇవ్వండి.
గణేష్: ఆదోనిలో ఐటీఐ కాలేజీ లేదు. మీరు అధికారంలోకి వచ్చాక కాలేజీ ఏర్పాటు చేయండి.
హారిక: దిశ చట్టం, యాప్ వల్ల ఎక్కడా ప్రయోజనం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మహిళలకు భద్రత కల్పించండి.
సురేష్: వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక ఆదోని నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మా గ్రామంలో విద్యార్థులకు రవాణా సౌకర్యం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక రవాణా, హాస్టల్ వసతులు ఏర్పాటు చేయండి.
అక్షితరెడ్డి, ఆదోని: నా ఇంటర్ పూర్తయ్యింది. మాకు డిగ్రీ కాలేజి లేదు. మేం పై చదువులు చదవాలంటే వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. ఉచిత విద్య అందే పరిస్థితి లేదు.
దినేష్, బీటెక్, ఆదోని: స్టార్టప్ కంపెనీలు పెట్టేందుకు వైసీపీ నుండి ప్రోత్సాహం లేదు. మీరు వచ్చాక ప్రోత్సాహకాలు అందించండి
నాగరాజు: నేను మెడికల్ కోడర్ జాబ్ చేస్తున్నాను. రాష్ట్రంలో మెడికల్ కోడింగ్ విధానం తక్కువగా ఉంది. మీరు మళ్లీ అధికారంలోకి వచ్చాక అవకాశాలు కల్పించండి.
మధు: విశాఖలో అబ్ధుల్ కలాం వ్యూ పాయింట్ కు వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు కూడా మార్చారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా మీరు ఎటువంటి చర్యలు తీసుకోండి.
పలుగుపట్టి మట్టితవ్విన యువనేత , ఉపాధి హామీ కూలీల కష్టాలు తెలుసుకున్న లోకేష్
ఆదోని నియోజకవర్గం పెద పెండేకల్ శివారు ఎర్రచెరువువంకలో ఉపాధి హామీ కూలీలను యువనేత కలిశారు. కూలీల వద్ద ఉన్న గడ్డపార తీసుకొని మట్టిని తవ్వుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనిచేస్తే రూ.150 కూలీ ఇస్తున్నారు. ఎండపొద్దున నీడకోసం కనీసం పరదా పట్టలు, మంచినీళ్లు కూడా ఏర్పాటుచేయడం లేదు. పెరిగిన ధరల కారణంగా ఇప్పుడిస్తున్న కూలీ ఏ మూలకూ సరిపోవడం లేదు. పనిదినాలు, కూలీ రేట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలి. మంచినీళ్లు, నీడ సౌకర్యం కల్పించాలి. గ్రామాల నుంచి పనిచేసే ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించాలి.
యువనేత లోకేష్ మాట్లాడుతూ…
పేదలకు ఇచ్చే ఉపాధి హామీ నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం వదిలిపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ లో రూ.261 కోట్ల ఉపాధి నిధులు దుర్వినియోగమైనట్లు కేంద్రమే చెప్పింది. ఉపాధి హామీ పథకంలో పేదల కష్టాన్ని వైసిపి నాయకులు మింగేస్తున్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఉపాధి పనులు చేసే పేదల కోసం నీడ ఏర్పాటుచేయడమే గాక ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో మజ్జిగ కూడా అందించాం. ఉపాధి పనుల కోసం గడ్డపారలు ఇవ్వడమేగాక, దూరాన్ని బట్టి అదనపు కూలీ చెల్లించాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంతో మాట్లాడి ఉపాధి హామీ పనిదినాలు, కూలీ పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటాం.
యువనేతను కలిసిన వాల్మీకి సామాజిక వర్గీయులు
ఆదోని నియోజకవర్గం ఆరేకల్ లో వాల్మీకి సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో దాదాపు 40లక్షలమంది వాల్మీకిల జనాభా ఉన్నారు. 1956వరకు ఎపిలో వాల్మీకిలు ఎస్టీ జాబితాలోనే కొనసాగారు. ఆ తర్వాత మైదాన ప్రాంతంలో ఉన్నవారిని బిసిలుగా, ఏజన్సీ ప్రాంతంలో ఉన్న వారిని ఎస్టీలుగా కొనసాగించారు. అత్యధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో వాల్మీకిలను బిసి జాబితాలో పెట్టడం అన్యాయం. ఇటీవల వైసీపీ ప్రభుత్వం కేవలం కొన్నిజిల్లాల్లో వాల్మీకిలను మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. వాల్మీకిల మధ్య ప్రాంతీయ విభేదాన్ని తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలి.
యువనేత లోకేష్ స్పందిస్తూ…
వాల్మీకి/బోయలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన పార్టీ తెలుగుదేశం. ఈ సామాజికవర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులును ఎంపిగా, రాష్ట్రమంత్రిగా చేసింది టిడిపినే. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా గత ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. గతంలో చేసిన తీర్మానం కేంద్రం వద్ద ఉండగా, వైసీపీ ప్రభుత్వం మరో అసంబద్ధమైన తీర్మానం చేసి పంపడంలో అంతర్యమేమిటో వాల్మీకులంతా గమనించాలి. వాల్మీకిలకు న్యాయం చేసేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది, టిడిపి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తాం.
Also, read this blog: Nara Lokesh’s Yuvagalam: A Movement for Youth in A.P
Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh