naralokesh padayatra ,yuvagalam,

*24గంటలూ గ్రామాలకు సురక్షితమైన తాగునీరిస్తాం*

*వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా నీటికష్టాలు తీరుస్తాం*

*పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చేస్తాం!*

*ప్రణాళికాబద్ధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి*

*సచివాలయాలను పంచాయితీలకు అనుసంధానిస్తాం!*

*గౌరవవేతనంతోపాటు గౌరవం కూడా పెంచుతాం*

*నిధులను నేరుగా పంచాయితీ ఎకౌంట్లకే జమచేస్తాం*

*నదుల అనుసంధానంతో సాగునీటి సమస్యకు చెక్*

*“పల్లెప్రగతి కోసం మీ లోకేష్” లో యువనేత స్పష్టీకరణ*

ఆదోని: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా గ్రామాల్లో 24/7 తాగునీరు అందిస్తామని తెలుగుదేశం పార్టీ యువనేత Nara lokesh ప్రకటించారు.  జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆదోని నియోజకవర్గం తుంబళం క్రాస్ వద్ద పంచాయితీరాజ్ ప్రతినిధులతో నిర్వహించిన పల్లెప్రగతి కోసం మీ లోకేష్ కార్యక్రమంలో యువనేత గ్రామీణాభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ విధానాన్ని సాక్షాత్కరించారు. కార్యక్రమానికి రాష్ట్ర సర్పంచ్ ల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు సంధానకర్తగా వ్యవహరించారు. యువనేత మాట్లాడుతూ… పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేస్తామని, ప్రణాళికాబద్ధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను పంచాయితీలతో అనుసంధానం చేస్తామని తెలిపారు. సర్పంచ్ లకు గౌరవ వేతనంతోపాటు గౌరవం కూడా పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను నేరుగా పంచాయితీలకే జమచేస్తాం. TDP

పాలనలో ఎన్జీఓలతో కలిసి స్మార్ట్ వార్డు, స్మార్ట్ విలేజీలను చేపట్టాం. దాన్ని మరింత అధికంగా చేయాల్సి ఉంది. కేంద్రం సీఎస్ఆర్ నిధులను ఖర్చుపెట్టాలని చెబుతోంది. ఎన్ఆర్ఐ, ఎన్జీఓ, పారిశ్రామకవేత్తల సహకారంతో వీటిన్నింటినీ వాడుకుని గ్రామాలను అభివృద్ధి చేస్తాం. నదుల అనుసంధానం ద్వారా తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సర్పంచ్ లు సందేహాలకు యువనేత స్పష్టమైన సమాధానాలిచ్చారు.

సంధానకర్త లక్ష్మీ ముత్యాలరావు అడిగిన ప్రశ్నలకు యువనేత సమాధానాలు:

ప్రశ్న: గ్రామాల సమస్యలను మీరు ఏవిధంగా పరిష్కరిస్తారు?

లోకేష్: పల్లెటూరుకు సేవ చేస్తే పరమాత్ముడికి సేవచేసినట్లే. నేను 24నెలలు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశా. 35లక్షల వీధిదీపాలు, 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, మోడల్ విలేజీలు, పాఠశాలలకు ప్రహరీలు, సంపద తయారీ కేంద్రాలు, ఎన్టీఆర్ సుజల స్రవంతి, ఎన్టీఆర్ జలధార వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాం. కానీ నేడు సర్పంచులకు కనీస గౌరవం లేదు. నిధులు, విధులు లేకుండా సర్పంచులు ఉన్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా పనులు చేశామో, అవి తప్ప కొత్తగా జరిగిన పనులేవీ జరగలేదు. మేం అధికారంలోకి వచ్చాక గ్రామాలను అభివృద్ధి చేస్తాం. గ్రామాలను పట్టణాలకు దీటుగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ఫైబర్ గ్రిడ్ ను మళ్లీ పునరుజ్జీవింపజేసి ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం వచ్చేలా చేస్తాం.

ప్రశ్న: రాష్ట్రాభివృద్ధిలో పంచాయతీల పాత్రపై టిడిపి విధానం ఎలా ఉంటుంది?

లోకేష్: సమగ్ర గ్రామీణాభివృద్ధి జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. మున్సిపాలిటీలు, పంచాయతీలకు మధ్య మేజర్ పంచాయతీలు ఉన్నాయి. వీటిని వివిధ రాష్ట్రాల్లో ఎలా అభివృద్ధి చేస్తున్నారో మేం పరిశీలిస్తున్నాం. అధికారంలోకి వచ్చాక మేజర్ పంచాయతీలపై ప్రత్యే శ్రద్ధ పెడతాం. గతంలో చిన్నపంచాయితీల్లో 10శాతం పంచాయతీ నిధులు ఖర్చు పెడితే, 90శాతం ప్రభుత్వం ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. కొన్ని పంచాయతీలకు 30:70నిష్పత్తి, 50:50 నిష్పత్తిలో నిధులిచ్చాం. పంచాయతీలను అభివృద్ధి చేశాం.

ప్రశ్న: నేడు పాలనలో పంచాయతీలు నిర్వీర్యం అవుతున్నాయి. వాటిని ఎలా కాపాడతారు?

లోకేష్: మేం అధికారంలో ఉండగా సర్పంచులతో పనులు చేయించాం. అభివృద్ధి పనులు పెండింగ్ ఉంటే సర్పంచులపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు 102 అవార్డులు వస్తే 82 రాష్ట్రప్రభుత్వానికి వచ్చాయి. జగన్ పాలనలో ఒక్క అవార్డు కూడా ఏపీకి రాలేదు. వైసీపీ అధికంగా పంచాయతీలు గెలిచింది. కానీ వైసీపీ సర్పంచులే ప్రభుత్వ బాధితులుగా మారారు. మేం అధికారంలోకి వచ్చాక గతంలో పంచాయతీలకు ఎలా నిధులు ఇచ్చామో అలాగే ఇచ్చి పనులు చేపిస్తాం. నేడు వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి పనిచేస్తేనే సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. కానీ వైసీపీ పాలనలో సర్పంచులకు పని లేకుండా చేస్తున్నారు. ఎమ్మెల్యేలు దోపిడీ పనుల్లో మునిగారు తప్ప, గ్రామాల అభివృద్ధిపై దృష్టి లేదు.

ప్రశ్న: గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఏమైనా పనులు చేయలేదని బాధపడుతున్నారా?

లోకేష్: నేను హైదరాబాద్ వాతావరణంలో పెరిగాను. కానీ నేను మంత్రిగా వచ్చినప్పుడు రాయలసీమ పల్లెలను చూస్తే బాధగా అనిపించింది. గ్రామాలను అభివృద్ధి చేయాలని సంకల్పించాను. కానీ ఇంటింటికీ నీటి కుళాయి, భూగర్భ డ్రైనేజీ పనులు చేయలేకపోయాను. ఈ రెండూ పల్లెలకు చేసి ఉంటే నేడు ప్రజలకు ఇబ్బందులు ఉండేవి కాదు. మేం అధికారంలోకి వచ్చాక ఈ రెండు పనులూ చేస్తాం.

సర్పంచ్ ప్రశ్నలకు లోకేష్ సమాధానాలు:

హెలీనా, రాజోలు: సర్పంచి అయ్యి రెండున్నరేళ్లు. మాకు విధులు, నిధులు లేవు. అనేక ఉద్యమాలు చేశాం. ప్రభుత్వంలో చలనం లేదు. మీరు అధికారంలోకి వస్తే సర్పంచులు పడే ఇబ్బందులను ఎలా పరిష్కరిస్తారు?

లోకేష్: రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశమే. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు, చివరకు సర్పంచులతో సహా బాధితులుగా మారారు. సర్పంచులకు రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. వాటిని వైసీపీ ప్రభుత్వం కాల రాస్తోంది. సర్పంచులకు విధులు, నిధులు లేకుండా ఏడిపిస్తోంది. పంచాయతీ ఖాతాలన్నీ ఖాళీ చేసింది. సర్పంచులను గెలిపించిన ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం నుండి సహాయ,సహకారాలు అందకపోవడంతో సర్పంచులు రోడ్డుమీదకు వచ్చే పరిస్థితులు లేవు. సర్పంచులు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులున్నాయి. పంచాయతీ ఖాతాలకే మేం నిధులు ఇస్తాం. సర్పంచులకు విధి,విధానాలు వెల్లడిస్తాం. గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని Chandhrababu Naidu అమలు చేస్తారు.

పగడాల రమేష్, వైసీపీ సర్పంచ్, సింగనపల్లి గ్రామం, ప్రకాశంజిల్లా: సర్పంచులకు మీరు అధికారంలోకి వచ్చాక ఏం న్యాయం చేస్తారు? వైసీపీ సర్పంచులను ఆదుకుంటారా? సర్పంచులు 75శాతం పేదవాళ్లే ఉన్నారు. పంచాయతీల అభివృద్ధి మీరు ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? రైతులను ఏ విధంగా మీరు ఆదుకుంటారు? విత్తనాలు, ఎరువులు కల్తీగా మారాయి. వాటిని మీరు ఎలా అరికడతారు? టీడీపీ పాలనలో వార్డు మెంబరుకు ఉన్న గౌరవం వైసీపీ పాలనలో సర్పంచులకు లేదు.

లోకేష్: మీడియా ఎదుటే వైసీపీ దుష్టపాలనను నిరసిస్తూ మీరు చెప్పులతో కొట్టుకున్నారు. నేనొక జత చెప్పులు ఇస్తా, ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు చెప్పులతో కొట్టాలి. వైసీపీ పాలనలో సర్పంచుల వ్యవస్థ నిర్వీర్యమైంది. టీడీపీ పాలనలో సర్పంచులకు గౌరవ వేతనాలను పెంచలేదు. కానీ పనులు చేయడానికి మేం నిధులిచ్చి సర్పంచుల గౌరవాన్ని నిలబెట్టాం. మేం అధికారంలోకి వచ్చాక పార్టీలతో సంబంధం లేకుండా, గ్రామీణాభివృద్ధికి పాటుపడే సర్పంచులను ప్రోత్సహిస్తాం. తాగునీటి సమస్యలు రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి. బోర్లు కొన్ని పాడైపోతున్నాయి. కొత్త బోర్లు వేయాల్సివస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక 25సంవత్సరాల దామాషాను చూసుకుని పంచాయతీలకు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను ఏర్పాటు చేసి ఇంటింటికీ కుళాయిల ద్వారా నీరు అందిస్తాం. చెక్ పవర్ ను సర్పంచులకు ఉండేలా చర్యలు తీసుకుంటాం. గౌరవవేతనం, సర్పంచులకు గౌరవాన్ని పెంచుతాం. సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేస్తాం.

తిమోతీ, జనసేన సర్పంచ్, కృష్ణాజిల్లా: వైసీపీ ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన నిధులను లాక్కుంది. నాకు ఉన్న పరిశ్రమను వదిలేసి గ్రామానికి ఏదైనా చేద్దాం అని సర్పంచ్ అయ్యాను. సర్పంచుల సమస్యలపై పోరాటాలు సరైన రీతిలో జరగలేదు. వలంటీర్లు, మాపై ఓడిపోయిన వైసీపీ వాళ్లు మా విధులను లాక్కున్నారు. రాజకీయాలపై విరక్తి వస్తోంది. మీరు మమ్మల్ని ఎలా ఆదుకుంటారు?

లోకేష్: రాజకీయాలపై ఏ ఒక్కరికీ విరక్తి రాకూడదు. నాపై 20కేసులు పెట్టినా నేను విసుగుచెందలేదు. మనం నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి పోరాడాలి. కష్టకాలంలో పోరాడితేనే మన రాటు తేలతాం. కలిసికట్టుగా పోరాడాలి, సమస్యల్ని పరిష్కరించుకోవాలి. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ కూడా తాము తీసుకుంటున్న వేతనాలు ప్రజలు కట్టే పన్నుల నుండి తీసుకుంటున్నారని తెలుసుకోవాలి. వాళ్లు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. నేడు స్టిక్కర్లు అతికించే కార్యక్రమంలో వలంటీర్లు పాల్గొంటున్నారు. పార్టీ కార్యకర్తల్లా వలంటీర్లు వ్యవహరిస్తే వ్యవస్థను ఉల్లంఘించినట్లే. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీలను మేం గతంలో ఎలా ప్రోత్సహించామో, అభివృద్ధి చేశామో రాజకీయాలకు, పార్టీలకు అతీంగా అభివృద్ధి చేస్తాం.

లెనిన్ బాబు, సీపీఐ సర్పంచ్, కఠారిగుంట, పత్తికొడ నియోజకవర్గం: సచివాలయాల్లో సర్పంచులకు ప్రథమ పౌరునిగా గౌరవం దక్కడం లేదు. మమ్మల్ని ఏ కార్యక్రమంలోనూ కలుపుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తారా? లేదా? గత పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన నిధులు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తారా? జగన్ మాదిరి నిధులు దారిమళ్లిస్తారా? గ్రామీణాభివృద్దికి మీ వద్ద సమగ్ర ప్రణాళిక ఉందా?

లోకేష్: ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్లు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామీణాభివృద్ధి సాధ్యం. సచివాలయ వ్యవస్థను మేం రద్దు చేయడం లేదు. వలంటీర్లు పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. అది ఉండకూడదు. పంచాయతీల నిధులను సంక్షేమ పథకాల కోసం మళ్లించుకుంటున్నామని వైసీపీ చెబుతోంది. కానీ మేం సంక్షేమ పథకాలు అమలు చేసి కూడా పంచాయతీ నిధులు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. 16,918 పంచాయతీలను నేను మంత్రిగా ఉన్నప్పుడు గ్రేడింగ్ చేసి అవసరం మేరకు నిధులు ఇచ్చాం. ఉపాధిహామీ పథకానికి 36పనులను అనుసంధానం చేసి మేం నిధులు ఇచ్చాం. నీటి సదుపాయం కోసం కేంద్ర,రాష్ట్ర నిధులను సగం సగం ఇచ్చి యుద్ధప్రాతిపదికన పనులు చేయించాం. అన్ని గ్రామాలను గ్రేడ్ల వారీగా విభజించి, అవసరమైన నిధులు కేటాయించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను అందిస్తాం.

రామకృష్ణనాయుడు, ఆముదాలవలస, శ్రీకాకుళం జిల్లా: వైసీపీ పాలనలో మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామీణ వ్యవస్థ నాశనమైంది. మీరు అధికారంలోకి వచ్చాక గ్రామాలకు పూర్వవైభవాన్ని తీసుకువస్తారా? పంచాయతీ నిధుల కోసం నేను పోరాడినందుకు 12కేసులు పెట్టారు. వీటిలో రేప్ కేసు కూడా ఉంది. మా నిధులు, విధులు కోసం మీరు కూడా పోరాడతారా?

లోకేష్: రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నేను పాదయాత్ర చేస్తున్నాను. మనమంతా ఒకసారి చర్చించి మీతో కలిసి పోరాడటానికి నిర్ణయం తీసుకుందాం. టీడీపీ పాలనలో వీధి దీపాల సమస్యల్ని కూడా డ్యాష్ బోర్డులో పెట్టి సమస్యలు పరిష్కరించాం. నేడు వీధి దీపాలు వేసే దిక్కులేదు. మేం అధికారంలోకి వచ్చాక మీ సమస్యల్ని పరిష్కరిస్తాం.

రాధిక, మంత్రాలయం, హనుమాపురం ఎంపీటీసి: ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు నిధులు లేవు. మీరు వచ్చాక ఇస్తారా?

లోకేష్: మేం అధికారంలోకి వచ్చాక ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నిధులు కేటాయిస్తాం. మేం అధికారంలో ఉండగా చెత్తనుండి సంపద తయారీ కేంద్రాలను నిర్మించాం. కానీ నేడు అవి తాగుబోతుల అడ్డాలుగా మారాయి. వైసీపీ చేపట్టిన తడిచెత్త, పొడిచెత్త కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. స్వచ్ఛ భారత్ మిషన్-2 కింద కేంద్రం నిధులు కేటాయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులను సరిగా వినియోగించడం లేదు. అందుకే గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు రావడం లేదు. మేం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను మంచిగా నిర్వహిస్తాం. స్వచ్ఛభారత్ అనేది ఎన్ని కార్యక్రమాలు చేసిన పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. కానీ కేజీ నుండి పీజీ వరకు పారిశుధ్యంపై కార్యక్రమాలు చేపడతాం.

శ్రీనివాసులు, రామపురం గ్రామం, పెనుగొండ: మేం సర్పంచులుగా ఎందుకు గెలిచామా అని బాధపడుతున్నాం. మాకు విధులు ఏమీ లేవు. ప్రజలకు సేవచేసే అవకాశం సర్పంచులకు ప్రభుత్వం ఇవ్వడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు విధులు, నిధులు ఇస్తారా?

లోకేష్: సర్పంచులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నింటినీ అమలు చేస్తాం. వలంటీర్లు, సచివాలయాలు, సర్పంచులను అనుసంధానం చేస్తాం. సర్పంచులకు విధులు, నిధులు ఇస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను ఇస్తాం.

గోపాలకృష్ణ, బీజేపీ సర్పంచ్, ఉప్పలూరు, కడప: గతంలో కొన్ని వృత్తులకు కరెంటు బిల్లులు మినహాయింపు ఉండేది. నేడు అది రద్దయ్యింది. మీరు వచ్చాక మమ్మల్ని ఏ విధంగా ఆదుకుంటారు?

లోకేష్: మేం అధికారంలోకి వచ్చే సమయానికి రూ.1,850కోట్లు పంచాయతీలకు బకాయిలుండేవి. వాటిని మేం రెండు విడతల్లో కొంతమేరకు పూర్తిచేశాం. ప్రభుత్వం మారడంతో ఈ భారాన్ని పంచాయతీలపై వైసీపీ ప్రభుత్వం వేసింది. మేం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే పంచాయతీల బకాయిలును నాలుగు విడతల్లో కడతాం.

వసంత్ కుమార్, ఆకునూరు గ్రామం సర్పంచ్, ఉయ్యూరు: పంచాయతీ నిధులు దారిమళ్లించకుండా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు?

లోకేష్: వైసీపీ ప్రభుత్వం పంచాయతీలకు అసలు నిధులు ఇవ్వడం లేదు. మేం అధికారంలోకి వచ్చాక నిధులు దారిమళ్లకుండా చర్యలు తీసుకుంటాం.

భూషణ్, ధర్మవరం నియోజకవర్గం, సత్యసాయిజిల్లా: రాయలసీమలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మీరు అధికారంలోకి వచ్చాక నీటి సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

లోకేష్: నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చంద్రబాబు క్లారిటీతో ఉన్నారు. గతంలో నీటి కుంటల తవ్వకం పథకం, గొలుసుకట్టు చెరువులు ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలు చేయించారు. నదులను కూడా అనుసంధానం చేసి నీటి సమస్యను పరిష్కరిస్తాం. గ్రామాల్లోని చెరువులను నీటితో నింపుతాం.

చందాఖాన్, కౌతాళం మాజీ ఎంపీపీ, కర్నూలుజిల్లా: మా ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేవు. చింత, గానుగ, వేప చెట్లను పెంచాల్సిన అవసరం ఉంది. దీన్ని ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేసి చెట్లను పెంచాలి. చెట్ల పెంపకమే ఓ ఉపాధిమార్గంగా మారుతుంది. దీన్ని చట్టబద్దంగా అమలు చేస్తారా?

లోకేష్: చెట్ల పెంపకంతో పాటు, హార్టీకల్చర్ ను కూడా అభివృద్ధి చేస్తే రాయలసీమలో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిద్వారా ఆర్థిక వనరులు వస్తాయి. చెట్ల పెంపకం పనులను ఖచ్చితంగా అమలు చేస్తాం.

కాట్రపాడు సర్పంచ్, గుంటూరుజిల్లా: వైసీపీ దోచుకున్న నిధులను మాకు ఇస్తారా? మీ ప్రభుత్వం కేటాయించే నిధులే ఇస్తారా?

లోకేష్: పంచాయతీ నిధులు దారిమళ్లడం వల్ల కేంద్రం ఇవ్వాల్సిన రూ.2,200కోట్లను కేంద్రం నిలిపేసింది. పంచాయతీలకు వైసీపీ ప్రభుత్వం లాక్కున్న నిధులను ఇచ్చే విధానంపై పార్టీతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు చివరిగా రూ.14వేల కోట్లు ఉపాధిహామీ నిధులను తీసుకున్నాం. కానీ నేడు కేంద్రం ఏపీకి ఉపాధిహామీ నిధులను తగ్గించింది. కరెంటు బిల్లుల భారం సర్పంచులపై పడకుండా మేం చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: గత ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ ఇస్తే, ఆ కాలం నాటి బిల్లులు పెండింగ్ ఉన్నాయని వైసీపీ ప్రభుత్వం బిల్లులు వసూలు చేస్తోంది. మీరు దాన్ని ఎలా పరిష్కరిస్తారు?

లోకేష్: ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి. బిల్లులు ఎవరూ కట్టొద్దు. మేం వచ్చాక చెల్లిస్తాం.

ఎన్.అరుణ, ఆలూరు సర్పంచ్: నేను బీఈడీ చదివి గ్రామానికి సేవ చేద్దామని సర్పంచ్ అయ్యాను. కానీ 10రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక కనీసం రెండు రోజులకు ఒకసారి అయినా నీళ్లు ఇస్తారా?

లోకేష్: రెండు రోజులకు ఒకసారి కాదు, 24గంటలూ తాగునీరు అందుబాటులో ఉండేలా మేం చర్యలు తీసుకుంటాం. వాటర్ గ్రిడ్ లను పూర్తిచేస్తాం. ఆలూరు బెంజి మంత్రికి ప్రజల సమస్యలపై శ్రద్ధ లేదు. అతనికి కేవలం బెంజికార్లలో తిరగడంపైనే దృష్టి ఉంది. మీరు సర్పంచ్ గా ఏ పనులు చేద్దామని కలలు కన్నారో, ఆ కలలను టీడీపీ నెరవేరుస్తుంది.

షహానా, అలగొండ సర్పంచ్, పత్తికొండ: మా గ్రామంలో చెరువు ఉంది. దానిపై రైతులు ఆధారపడి ఉన్నారు. చెరువు పూడిక తీయడం లేదు. గ్రామానికి సొంత నిధులతో పనులు చేస్తున్నాం.

లోకేష్: గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేయడం ద్వారా నీటి సమస్యను పరిష్కరిస్తాం.

మోహన్ రెడ్డి, పాణ్యం: స్థానిక ఎమ్మెల్యే సర్పంచులను చంపుతామని బెదిరిస్తున్నాడు. ఏపీఐఐసీ భూములను ఎమ్మెల్యే లాక్కున్నాడు. మీరు అధికారంలోకి వచ్చాక ఆ భూములను కాపాడాలి.

లోకేష్: ఓర్వకల్లులో పరిశ్రమలు పెట్టేందుకు భూములను ఏపీఐఐసీ ద్వారా సేకరించాం. మేం అధికారంలోకి వచ్చాక కర్నూలు కేంద్రంగా ఫార్మా పరిశ్రమలు పెట్టి యువతకు ఉద్యోగాలు ఇస్తాం. కర్నూలును అభివృద్ధి చేస్తాం.

Also, read this blog: Redefining Leadership: The Yuvagalam Approach

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *